ఆ ఇద్దరు హీరోయిన్ల పేరు ఒకటే. పైగా ఇద్దరూ స్నేహితురాళ్ళు కూడా. ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ఎంతో అభిమానం. ఇద్దరూ వేర్వేరు భాషలకు చెందిన వారైనా చిత్ర పరిశ్రమకు వచ్చిన తర్వాత వారి మధ్య స్నేహం బాగా బలపడిరది. వారి పేరు కన్నడ మంజుల, మంజుల. ఒకరు కన్నడ రంగం నుంచి వస్తే.. మరొకరు తమిళ ఇండస్ట్రీ నుంచి వచ్చారు. అయినప్పటికీ పలు భాషల్లో హీరోయిన్లుగా నటించి ఇద్దరూ చాలా మంచి పేరు తెచ్చుకున్నారు. ఈ ఇద్దరికీ ఎన్నో పోలికలు ఉన్నాయి. ఇద్దరూ 1954వ సంవత్సరంలోనే పుట్టారు. వీరిద్దరి జీవితాలూ ఒకే విధంగా ముగిసిపోవడం మాత్రం విచారకరం. మరి వారి సినీ జీవితం ఎలా కొనసాగింది, ఎలాంటి విజయాలు సొంతం చేసుకున్నారు, వారి జీవితంలో ఏర్పడిన ఆ విషాద ఘటనలు ఏమిటి అనే విషయాలు తెలుసుకుందాం.
కన్నడ మంజుల.. 1954 నవంబర్ 8న కర్ణాటకలోని తుమకూరుకు సమీపంలోని ఒక గ్రామంలో జన్మించారు. ఆమెకు చిన్నతనం నుంచి నాట్యం ఎంతో మక్కువ. బెంగళూరులో కె.ఆర్.రామ్ వద్ద భరతనాట్యం అభ్యసించారు మంజుల. ఆ తర్వాత అరంగేట్రం చేసి ఎన్నో నృత్య ప్రదర్శనలు ఇచ్చారు. రాష్ట్ర నృత్యపోటీల్లో ప్రథమ బహుమతి సాధించింది. మనెకట్టినోడు అనే కన్నడ సినిమాతో బాలనటిగా చిత్ర పరిశ్రమకు పరిచయమైంది. ఆ తర్వాత మళ్ళీ సినిమాల్లో కనిపించలేదు. హైస్కూల్‌లో చదువుతున్న రోజుల్లో మంజులకు ఎరడు ముఖి, యారు సాక్షి చిత్రాల్లో నటించే అవకాశం వచ్చింది. ఈ రెండు సినిమాలు ఆమెకు మంచి పేరు తెచ్చాయి. ఆ తర్వాత మంజుల నటించిన ప్రొఫెసర్ హుచ్చురాయ చిత్రంతో మరింత పేరు తెచ్చుకున్నారు. అంతకుముందు సంపత్తిగే సవాల్ చిత్రంలో కన్నడ కంఠీరవ రాజ్‌కుమార్ సరసన నటించారు. ఈ సినిమాను తెలుగులో నటుడు చలం తోటరాముడు పేరుతో రీమేక్ చేశారు. ఈ చిత్రంలో చలం సరసన నటించారు మంజుల. ఆ తర్వాత పూజ చిత్రంలో రామకృష్ణకు హీరోయిన్‌గా నటించారు. ఇంకా మరికొన్ని తెలుగు సినిమాలో ముఖ్యమైన పాత్రలు పోషించారు. ఎక్కువగా కన్నడ, తమిళ్ చిత్రాల్లోనే ఆమె కనిపించారు. 1966 నుంచి 1985 వరకు ఆమె 100కు పైగా సినిమాల్లో నటించారు. కన్నడ దర్శకుడు అమృతంను పెళ్ళి చేసుకున్నారు. వారికి ఒక కుమారుడు. వివాహం తర్వాత సినిమాలకు స్వస్తి చెప్పి వైవాహిక జీవితంలో కొనసాగారు. 1986 సెప్టెంబర్ 5 ఆమె జీవితంలో విషాదాన్ని నింపిన రోజు. ఇంటికి వచ్చిన బంధువుల కోసం కాఫీ రెడీ చేయడానికి వంటగదిలోకి వెళ్ళి గ్యాస్ ఆన్ చేసింది మంజుల. ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ సమయంలో ఆమె సిల్క్ నైటీ ధరించి ఉండడంతో ఆమెను మంటలు చుట్టుముట్టాయి. తీవ్ర గాయాల పాలవడంతో ఆమెను ఆస్పత్రికి తరలించారు. వారం రోజుల పాటు మృత్యువుతో పోరాడి సెప్టెంబర్ 12న 31 ఏళ్ళ అతి చిన్న వయసులో తుదిశ్వాస విడిచారు కన్నడ మంజుల.
మంజుల విజయ్‌కుమార్.. 1954 జూలై 4న తమిళనాడులో జన్మించారు. 1970లో వచ్చిన తమిళ చిత్రం శాంతి నిలయంలో బాలనటిగా కనిపించారు మంజుల. ఎం.జి.రామచంద్రన్ హీరోగా రూపొందిన రిక్షాకారన్ చిత్రం ద్వారా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు. తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో 100కు పైగా సినిమాల్లో నటించారు. తెలుగులో ఎన్టీఆర్, ఎఎన్నార్, కృష్ణ, శోభన్‌బాబు వంటి అగ్ర హీరోల సరసన నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. 1970వ దశకంలో అగ్ర హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న వాణిశ్రీకి మంజుల గట్టి పోటీ ఇచ్చారు. 1974లో కృష్ణ హీరోగా ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో వచ్చిన మాయదారి మల్లిగాడు చిత్రంతో మంజుల గ్లామర్ హీరోయిన్‌గా మంచి పేరు తెచ్చుకున్నారు. హీరోయిన్‌గా బిజీగా ఉన్న టైమ్‌లోనే అప్పటికే పెళ్ళయిన నటుడు విజయ్‌కుమార్‌ను పెళ్లి చేసుకున్నారు మంజుల. వీరికి ముగ్గురు అమ్మాయిలు, ఒక అబ్బాయి. వనిత, ప్రీత, శ్రీదేవి హీరోయిన్లుగా కొన్ని సినిమాల్లో నటించారు. అరుణ్ విజయ్ హీరోగా, విలన్‌గా రాణిస్తున్నారు. మంజుల తన సెకండ్ ఇన్నింగ్స్‌లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించారు. వెంకటేష్ హీరోగా నటించిన వాసు ఆమె చివరి చిత్రం. 2013 జూలై 20న మంజుల మంచం మీద నుంచి ప్రమాదవశాత్తూ కింద పడిపోవడంతో తలకు తీవ్ర గాయమైంది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ జూలై 23న కన్నుమూశారు మంజుల. ఒకే సంవత్సరం పుట్టిన కన్నడ మంజుల, మంజుల ఇద్దరూ ప్రమాదవశాత్తూనే మరణించడం కాకతాళీయమనే చెప్పాలి.